సీటు కోసం ఆర్టీసీ బస్సులో మహిళల కొట్లాట

-

మహాలక్ష్మి పథకంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం అందుబాటులోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులో మహిళా ప్రయాణికుల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. దీనివల్ల బస్సుల్లో రద్దీ బాగా పెరిగి పలుమార్లు సీట్లు కూడా దొరకడం లేదు. అయితే రద్దీ వల్ల చోటు దక్కక బస్సుల్లో సీట్ల కోసం కొన్నిసార్లు ప్రయాణికుల మధ్య గొడవలు జరుగుతున్నాయి.

తాజాగా నిర్మల్‌ జిల్లా ముథోల్‌ మండల కేంద్రంలో సీటు కోసం మహిళలు కొట్లాడుకున్నారు. నిజామాబాద్‌ నుంచి భైంసా వస్తున్న ఆర్టీసీ బస్సు గురువారం మధ్యాహ్నం ముథోల్‌ ప్రయాణ ప్రాంగణానికి చేరుకున్న తర్వాత కొన్ని సీట్లు ఖాళీ అయ్యాయి. అప్పటికే రెండు బస్సులు చెడిపోవడంతో అందులోని ప్రయాణికులు ఈ బస్సులో ఎక్కారు. అయితే ముథోల్‌లో ఎక్కిన కొందరు మహిళలు సీటు ఆపగా అప్పటికే బస్సులో ఉన్న మహిళలు సీటు లేక నిలబడి ఉన్నారు. ఈ క్రమంలో కొత్తగా ఎక్కిన వారికి సీటు ఆపడంతో ఆ సీటు కోసం పలువురు మహిళల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అది కాస్త గొడవకు దారి తీసి ఇరు వర్గాలు కొట్టుకునే దాకా వచ్చాయి. చివరికి నిజామాబాద్‌ నుంచి వస్తున్న మహిళ బస్సు దిగిపోగా గొడవ సద్దుమణిగింది.

Read more RELATED
Recommended to you

Latest news