భారత్ రాష్ట్ర సమితి లోక్ సభ ఎన్నికల కసరత్తులో భాగంగా నేటి నుంచి శాసనసభ నియోజకవర్గాల వారీగా విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఇప్పటికే 17 లోక్ సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశాలు పూర్తయ్యాయి. వాటికి కొనసాగింపుగా ఇవాళ్టి నుంచి వచ్చే నెల పదో తేదీ వరకు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు జరగనున్నాయి. స్థానిక శాసనసభ్యులు, నియోజకవర్గాల ఇన్ ఛార్జ్ ఆధ్వర్యంలో సమావేశాలు నిర్వహిస్తారు. రాష్ట్ర పార్టీ తరపున ప్రతినిధులు సమావేశాలకు ప్రత్యేక అతిథులుగా హాజరు కానున్నారు.
ఇటీవలి శానససభ ఎన్నికలకు సంబంధించిన సమీక్షతో పాటు స్థానికంగా క్షేత్రస్థాయిలో ఉన్న అంశాలపై ఈ సమావేశాల్లో విస్తృతంగా చర్చించనున్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అనుసరించాల్సిన కార్యాచరణపై కూడా చర్చించనున్నట్లు సమాచారం. మొదటి రోజైన ఇవాళ సిద్దిపేట, బోథ్, జూబ్లీహిల్స్, వనపర్తి, నల్గొండ నియోజకవర్గాల్లో భారాస విస్తృత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. అటు మైనార్టీ నేతలతో పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు.