టీడీపీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ పల్లె బాగుపడదని ఆంధ్ర ప్రదేశ్ సీఎం, వైసీపీ అధినేత జగన్ అన్నారు. 14 ఏండ్లుగా ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు మార్క్ ఎక్కడుందని ఆయన ప్రశ్నించారు. ఎక్కడ చూసినా వైసీపీ మార్క్ మాత్రమే కనిపిస్తుందని అన్నారు. ఏపీలో ఎన్నికల శంఖారావాన్ని ముఖ్యమంత్రి జగన్ పూరించారు. భీమిలిలో శనివారం నిర్వహించిన వైసీపీ సిద్ధం సభలో పాల్గొన్నారు. ఈ సభలో మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై ధ్వజమెత్తారు.
ప్రతి ఇంట్లో వైసీపీ లబ్ధిదారుడు ఉండటం చూసి 75 ఏళ్ల వయసు మళ్లిన చంద్రబాబు భయపడుతున్నాడని సీఎం జగన్ విమర్శించారు. ‘అందుకే ఒంటరిగా పోటీ చేసే ధైర్యంలేక దత్తపుత్రుడితో సహా ఇతరులతో పొత్తు కోసం వెంపర్లాడుతున్నాడు. కొత్త వాగ్ధానాలతో గారడీ చేయాలని చూస్తున్నాడు. అంటే ప్రజల్లో వారు లేరని అర్థం. 2019లో వచ్చిన 23 స్థానాలు కూడా ఈసారి రావని అర్థం. వారికి కనీసం అభ్యర్థులు కూడా లేరు’ అని ఎద్దేవా చేశారు.