ఏపీలో ప్రముఖ సినీనటుడు పవన్‌కళ్యాణ్ జనసేన పార్టీ పరిస్థితి ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పార్టీలో ఎవరు ఎప్పుడు ఉంటారో ? ఎవరు బయటకు వెళతారో ? తెలియని పరిస్థితి. ఎన్నికల్లో ఆ పార్టీ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు సైతం త్వరలోనే వైసీపీలోకి వెళ్లే ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి.
ఇదిలా ఉంటే గత ఎన్నికల్లో జనసేన నుంచి పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల్లో చాలా మంది ఇప్పటికే తమ దారి తాము చూసేసుకున్నారు. అసలు ఆ పార్టీలో ఉండేందుకు కీలక నాయకులే ఇష్టపడని టైంలో పవన్ ఇప్పుడు పదవుల పంపకాలు చేస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తాజాగా జనసేనలో ముగ్గురు నేతలకు పదవులు లభించాయి.
ఈ ముగ్గురు అంత పేరున్న నేతలు అయితే కాదు. జనసేన పార్టీకి మరో ప్రధాన కార్యదర్శి, ఇద్దరు కార్యదర్శులను నియమించారు. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. జనసేన కొత్త ప్రధాన కార్యదర్శిగా బొలిశెట్టి సత్యనారాయణ (సత్య), కార్యదర్శులుగా గుంటూరుకు చెందిన గద్దె తిరుపతిరావు, మంగళగిరికి చెందిన చిల్లపల్లి శ్రీనివాస్ నియమితులు అయ్యారు.
ఈ ముగ్గురు కొన్ని సంవత్సరాలుగా పార్టీకి విలువైన సేవలు అందిస్తున్నారని పార్టీ అధ్యక్షుడు పవన్ కొనియడారు. ఇక విశాఖ నగరానికి చెందిన సత్య పర్యావరణానికి సంబంధించిన అంశాలపై పార్టీ తరపున పని చేస్తారని పేర్కొన్నారు. విచిత్రం ఏంటంటే ఇప్పటికే ఎన్నికల్లో చిత్తుగా ఓడిన జనసేన ఇప్పటకీ అయినా పార్టీని సంస్థాగతంగా క్షేత్ర, జిల్లా స్థాయి నుంచి పటిష్టం చేసేందుకు ఎంత మాత్రం ఆసక్తి చూపడం లేదు. మరి ఈ లెక్కన త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలను ఎలా ? ఎదుర్కొంటారో ? చూడాలి.