జగన్ ఘోరంగా ఓడిపోవడం ఖాయం అన్నారు ఎంపీ రఘురామకృష్ణరాజు. నెల రోజుల క్రితం టీడీపీ – జనసేన కూటమి ఓటింగు ఎలా ఉందో ఇప్పటికీ అలాగే ఉండగా, వైకాపా ఓటింగ్ క్షీణించి కాంగ్రెస్ పార్టీ ఓటింగ్ పెరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఐదు నుంచి ఆరు శాతంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ, భవిష్యత్తులో 10 నుంచి 12 శాతానికి పెరిగితే, రానున్న ఎన్నికల్లో వైకాపా సింగల్ డిజిట్ కే పరిమితం కావలసివస్తుందని, అందుకే జగన్ మోహన్ రెడ్డి గారు తన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా విజయమ్మ గారిని చేరదీసే ప్రయత్నాలను చేస్తున్నారని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు.

భీమిలి నియోజకవర్గం సంగి వలసలో నిర్వహించిన సిద్ధం సభకు ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల నుంచి మూడు లక్షల మంది ప్రజలు హాజరవుతారని వైకాపా నాయకత్వం అంచనా వేయగా, 30 వేల మంది కూడా హాజరు కాలేదని రఘురామకృష్ణ రాజు గారు అన్నారు. శనివారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ పీలేరులో నిర్వహించిన రా కదిలిరా సభకు 50 నుంచి 70 వేల మందికి పైగా హాజరవుతారని ఆశించగా, లక్ష మందికి పైగా హాజరయ్యారని, వైకాపా నిర్వహించిన సిద్ధం సభకు 1100 బస్సులను ఏర్పాటు చేసి, ప్రయాణికులను ఇబ్బందులు పెట్టి, ప్రభుత్వ పథకాలు అందవని ప్రజలను బెదిరించి, బిర్యానీ ప్యాకెట్లు, మందు సరఫరా చేస్తామని చెప్పినా ఎవరు కూడా వైకాపా నాయకులు ఏర్పాటు చేసిన బస్సులలో ఎక్కలేదని అన్నారు.