లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో ఒక్క చాన్స్ ప్లీజ్ అనే నేతల జాబితా భారీగా పెరిగింది. తెలంగాణలో మొత్తం 17 లోక్సభ సీట్లు ఉండగా ఎంపీగా పోటీ చేసే ఆశావహులు ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తోంది. తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలంటూ పీసీసీ కి ఏకంగా 306 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.అయితే వీళ్ళలో ఎంతమందికి టికెట్లు దక్కుతాయి అనేది పక్కన పెడితే ఈ జాబితపై కసరత్తు చేయడం ఇప్పుడు కాంగ్రెస్ కి పెద్ద టాస్క్ గా మారింది. కాగా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఎవరికి వారు టికెట్ తనకే అంటూ నియోజకవర్గాల్లో ప్రచారాలు కూడా మొదలెట్టేసారని సమాచారం.
ఎంపీగా అవకాశము ఇవ్వాలని కోరుతూ 306 దరఖాస్తులు వచ్చాయని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వరంగల్, పెద్దపల్లి నియోజకవర్గాల నుంచి అధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.ఆశావహుల్లో నేతలతో పాటు ప్రొఫెసర్లు, పలువురు ఉన్నతాధికారులు సైతం ఉన్నారు. ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, భువనగిరి నుంచి పీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, సికింద్రాబాద్ సీటు కోసం డాక్టర్ రవీందర్ గౌడ్, వేణుగోపాల్ స్వామి, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ, వరంగల్ నుంచి మోత్కుపల్లి నర్సింహులు, మహబూబాబాద్ నుంచి విజయాభాయ్ తదితరులు ఉన్నారు. ముఖ్యంగా కీలక నేతలు అసెంబ్లీకి బదిలీ కావడంతో వాళ్ల స్థానాల్లో వారి బంధువులు, సన్నిహితులు బరిలో నిలిచేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.రేవంత్ రెడ్డి సీఎం కావడంతో ఖాళీ అయిన మల్కాజిగిరి ఎంపీ సీటు కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ సహా ప్రముఖ సిని నిర్మాత బండ్ల గణేష్ కూడా ఉన్నారు.ఇంకా సీఎం సన్నిహితులు పటేల్ రమేష్ రెడ్డి, చామల కిరణ్ లు కూడా మల్కాజిగిరి టికెట్ ను ఆశిస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ తరఫున ఖమ్మం లోక్ సభ స్థానం హాట్ సీట్ గా మారింది. డిప్యూటీ సీఎం భట్టి సతీమణి మల్లు నందిని సహా, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి, సీనియర్ నేత వీహెచ్ సైతం అప్లికేషన్లు సమర్పించారు.అలాగే, ప్రముఖ వ్యాపారవేత్త, వీవీసీ గ్రూపు సంస్థల ఎండీ వంకాయల పాటి రాజేంద్ర ప్రసాద్ సైతం దరఖాస్తు చేశారు.భట్టి సతీమణి 500 కార్ల కాన్వాయ్ తో ఖమ్మం నుంచి భారీగా కార్యకర్తలతో తరలివచ్చి మరీ గాంధీ భవన్ లో దరఖాస్తు సమర్పించారు. మాజీ హెల్త్ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఖమ్మంతో పాటు సికింద్రాబాద్ ఎంపీ స్థానానికి దరఖాస్తు చేశారు.గతంలో కొత్తగూడెం అసెంబ్లీ టికెట్ ఆశించినా కేసీఆర్ టికెట్ ఇవ్వలేదు.రేవంత్ సర్కార్ కొలువుదీరాక లాంగ్ లీవ్ లో ఉన్న శ్రీనివాసరావు తన సన్నిహితుల ద్వారా గాంధీ భవన్ కు దరఖాస్తు సమర్పించారు.తెలంగాణ కాంగ్రెసులో ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.