పార్లమెంట్ ఎన్నికల ముందు మహారాష్ట్ర అసెంబ్లీ కీలక బిల్లుకు ఆమోదం తెలిపింది.మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ బిల్లు ద్వారా మరాఠా కమ్యూనిటీకి విద్య, ఉద్యోగ అవకాశాల్లో 10శాతం రిజర్వేషన్ కల్పించనున్నారు. మహారాష్ట్ర వెనకబడిన తరగతుల కమిషన్ సమగ్ర నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ప్రభుత్వాలు ఇదే తరహా రిజర్వేషన్లను తీసుకొచ్చినా చట్ట పరమైన సమస్యలతో నిలిచిపోయాయి. కాగా ఇప్పటికే రాష్ట్రంలో 52 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయి.
ఈ బిల్లుకు సంబంధించిన పూర్తి నివేదికను మహారాష్ట్ర వెనకబడిన తరగతుల కమిషన్ నిన్న ప్రభుత్వానికి అందజేసింది. సుమారు 2.5 కోట్ల కుటుంబాలను సర్వే చేసి ,సామాజిక, ఆర్థిక, విద్యాపరమైన వెనకపబడిన మరాఠా సామాజిక వర్గానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆ నివేదికలో పొందుపర్చింది.మహారాష్ట్ర మొత్తం జనాభాలో సుమారు 28 శాతం మరాఠాలు ఉన్నారని సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు.మరాఠా రిజర్వేషన్ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదం పొందడంతో శివసేన , బీజేపీ కార్యకర్తలు బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.