తెలంగాణ కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం పై మాజీ మంత్రి హరీశ్ రావు ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. జీతాల విషయంలో కాంగ్రెస్ చెబుతున్నది ఒకటి.. చేస్తున్నది ఒకటి అంటూ మండిపడ్డారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ప్రతినెల ఒకటో తేదీ న జీతాలు చెల్లిస్తామని ఎన్నికల ప్రచారం చేసుకున్నారు.
కానీ ఆచరణ మాత్రం సాధ్యం కావడం లేదు. 22 రోజులు గడుస్తున్నా అంగన్ వాడీలకు జీతం రాక అనేక తిప్పలు పడుతున్నారు. నెల అంతా పని చేసి జీతం కోసం ఎదురుచూడాల్సిన దుస్థితి వచ్చింది. ప్రభుత్వం తక్షణమే స్పందించి.. అంగన్ వాడీ టీచర్లు, అయాలు, సమగ్ర శిక్ష, కేజీబీవీ సిబ్బంది జీతాలు చెల్లించాలని హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు 100 రోజుల్లోనే అన్ని హామీలను అమలు చేస్తామని.. తాను సీఎంగా ప్రమాణం చేయగానే రుణమాఫీ చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి మాయ మాటలు చెప్పాడని పేర్కొన్నారు. ఎన్నికల్లో గెలిచిన తరువాత ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు.