బీఆర్ఎస్ లో ఇంకా ఎంత కాలం అవమానాలు భరిస్తారంటూ ఆ పార్టీ నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో కష్టపడే వాళ్లకు గుర్తింపు లభించదని చెప్పారు. తాజాగా ఆయన గాంధీభవన్ లో మీడియాతో మాట్లాడారు. కష్టపడే నాయకులకు కాంగ్రెస్ లోనే గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీలో ప్రతీ వ్యక్తికి గౌరవం ఇస్తామన్నారు. బీఆర్ఎస్ కోసం 20 ఏళ్లకు పైగా కష్టపడిన నాయకులు ఎందరో ఉన్నారని.. కానీ సదరు నాయకులు బీఆర్ఎస్ లో సరైన అవకాశాలు లభించలేదన్నారు.
తెలంగాణ ఉద్యమం కోసం పని చేసినోళ్లను కాదని.. ఇతరులకు పదవులు కట్టబెట్టారన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి పేరుతో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ అమరుల త్యాగాలపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి.. ఉద్యమకారులను విస్మరించిందన్నారు. ఇప్పటికే చాలా మంది నాయకులు అవమానాలు భరించలేక పార్టీలోకి వస్తున్నారని.. భవిష్యత్ లో భారీ స్థాయిలో చేరికలుంటాయని మంత్రి క్లారిటీ ఇచ్చారు. ప్రజా పరిపాలనలో భాగస్వామ్యం అయ్యేందుకు నేతలు కాంగ్రెస్ లోకి రావాల్సిన అవసరం ఉందన్నారు.