రాజకీయాల కోసం మేడిగడ్డను వాడుకోవద్దని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. మేడిగడ్డ కుంగిపోవడానికి సాంకేతిక కారణాలు ఉండొచ్చని పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. మేడిగడ్డకు ఖర్చు చేసింది రూ.3వేల కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. రాజకీయాల కోసం రైతులను కాంగ్రెస్ ఇబ్బంది పెడుతోందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.
రేవంత్ సీఎం అయ్యాక భాష మార్చుకుంటారనుకున్నాం. ఆయన ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి అని మరిచిపోయినట్టున్నారు. హామీల అమలు పక్కనబెట్టి ప్రతిపక్షాలపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకున్నారు. ఆరు గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేశాం. జాతీయ స్థాయిలో తెలంగాణను అగ్రగామిగా తీర్చిదిద్దాం. రాజకీయాల కోసం మేడిగడ్డను వాడుకోకుండా రైతులు నష్టపోకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నాం. కాంగ్రెస్ ఇచ్చిన 13 హామీలను వెంటనే అమలు చేయాలి. అని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.