మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పికప్ వాహనం నియంత్రణ కోల్పోయి బోల్తా పడింది. దిండోరీలోని బంద్ఝర్ ఘాట్ ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 14 మంది దుర్మరణం చెందారు. మరో 20 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులకు షాపురా కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. అక్కడ వారికి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ స్పందించారు. 14 మంది మరణించడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ముఖ్యమంత్రిమోహన్ యాదవ్ రూ.4 లక్షల పరిహారం ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని జిల్లా అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. మరోవైపు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న అధికారులు మృతులను గుర్తించే పనిలో ఉన్నారు. గాయపడిన వారి నుంచి వివరాలు సేకరించనున్నట్లు పోలీసులు తెలిపారు.