ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండ్రోజుల తెలంగాణ పర్యటన ముగిసిన విషయం తెలిసందే. నిన్న ఆదిలాబాద్లో మోదీకి ఘన స్వాగతం పలికి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్టులో వీడ్కోలు పలికారు. ఈ నేపథ్యంలో ఈ పర్యటనలో మోదీకి 11 అంశాలపై సీఎం రేవంత్ వినతి పత్రం అందజేశారు. అందులో రాష్ట్రంలో ఇంటింటికీ నల్లా నీళ్లు అందించేందుకు కేంద్ర జలజీవన్ మిషన్ నిధులు, మరో 29 ఐపీఎస్ల కేటాయింపులు, మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళనపై ప్రధానికి ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.
ఎన్టీపీసీలో మిగిలిన 2,400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలని రేవంత్ రిక్వెస్ట్ చేశారు. తుమ్మిడిహట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భూ సేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేందుకు జోక్యం చేసుకోవాలని విన్నవించారు. హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలని కోరారు.