రెండు టీవీ చానెళ్ల రేటింగ్‌ను ఎక్కువగా చూపేందుకు యత్నించిన ఇద్దరు నిందితులను తొలిసారి బ్రాడ్ కాస్ట్ అడియెన్స్ రిసెర్చ్ కౌన్సిల్ (బార్క్) గుర్తించింది. ఈమేరకు ఆ ఇద్దరిపై హైదరాబాద్‌లోని వెస్ట్ మారేడ్‌పల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు. టీవీ రేటింగ్ లను గుర్తించి రిపోర్ట్ చేసే బార్క్ గృహ మీటర్లను తారుమారు చేసి టెలివిజన్ పరిశ్రమకు నష్టాలు కలిగించినట్లుగా పోలీసులు తమ దర్యాప్తులో గుర్తించారు. టీవీ రేటింగ్ లను తారుమారు చేయటంలో నిందితుల పాత్రపై లోతైన దర్యాప్తు చేపట్టి పోలీసులు పలు అంశాలను నిర్ధారించుకున్నారు.
ఆ తర్వాత నిందితుల పాత్ర ఉందని తేలటంతో దర్యాప్తు అధికారులు సికింద్రాబాద్ లోని మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ముందు ఛార్జిషీట్ దాఖలు చేశారు. టీవీ చానెళ్లలో యాడ్స్‌కు ఎక్కువ మొత్తంలో డబ్బులు తీసుకునేందుకు ఇద్దరు నిందితులు ఈ అక్రమానికి పాల్పడినట్లుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఆ చానళ్ల పేరుగాని..నిందితుల పేర్లుగాని చెప్పలేదు. పూర్తి విచారణ చేపట్టాకే మిగతా విషయాలను తెలియజేస్తామని పోలీసులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి కేసు నమోదవడం తొలిసారి అని బార్క్ అధికారులు స్పష్టం చేశారు. కొంతకాలం క్రితం కర్ణాటక, మధ్యప్రదేశ్, అస్పాంల్లో టీవీ రేటింగ్స్ అక్రమాలపై దృష్టి పెట్టిన బార్క్ తొలిసారి తెలంగాణలోనూ రంగంలోకి దిగింది. ఈ పరిణామంతో మరింత లోతుగా అధ్యయనం చేస్తే చానెళ్ల అక్రమాలు బయట పడే అవకాశం ఉందని బార్క్ భావిస్తోంది. ఇలా గోల్‌మాల్‌చేస్తున్న చానెళ్లలో న్యూస్ చానెళ్లు కూడా ఉండవచ్చన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే టెలివిజన్ రంగం బాగా నష్టాల్లో ఉందన్న అభిప్రాయం ఆ రంగ ప్రముఖులు వ్యక్తం చేస్తున్నారు. పేరెన్నికగన్న నాలుగైదు ఎంటర్‌టైన్ చానెల్స్ మినహా మిగతావన్నీ నష్టాల బాటలోనే ఉన్నాయని చెప్పుకొస్తున్నారు. ఇక టీవీ చానెళ్లయితే మరీ కష్టాల్లో ఉన్నాయని వాపోతున్నారు. ఇప్పటికే కొన్ని చానెళ్లు మూతపడ్డ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. నష్టాల్లో ఉన్న చానెళ్లే తమకు ఎక్కువగా రేటింగ్ ఉందని చెప్పుకుంటూ యాడ్స్ తెచ్చుకునే ప్రయత్నాన్ని సాగిస్తున్నాయని పేర్కొంటున్నారు.