ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ వారసుడిగా పేరు తెచ్చుకొన్న అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందినట్లు ఆ దేశ మీడియా వర్గాలు ధ్రువీకరించాయి. ఈ వార్త ఆ దేశ రాజకీయ చిత్రపటాన్ని మార్చేయనుంది. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు రైసీ తర్వాత ఎవరు ఆ పదవి చేపడతారనే చర్చ మొదలైంది.
ఇస్లామిక్ రిపబ్లిక్ రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 131 ప్రకారం.. అధ్యక్షుడు అకస్మాత్తుగా మరణిస్తే ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆ పదవిని చేపడతారు. దీనికి దేశ సుప్రీం లీడర్ ఖమేనీ ఆమోద ముద్ర అవసరం. అనంతరం ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్, పార్లమెంట్ స్పీకర్, న్యాయ విభాగాధిపతితో కూడిన ఓ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసి 50 రోజుల్లోపు కొత్త అధ్యక్షుడి కోసం ఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది.
రైసీ వయసు 63 ఏళ్లు. 2021లో జరిగిన ఎన్నికల్లో రైసీ అధ్యక్షుడిగా గెలిచారు. అప్పట్లో ఆయన ఎన్నిక కోసం చాలా మంది అభ్యర్థులపై అనర్హత వేటు వేశారు. ఆ తర్వాత దేశంలో ఆయన పరపతి గణనీయంగా పెరిగింది. ఖమేనీ వారసత్వాన్ని అందుకొంటారనే ప్రచారం కూడా బలంగా జరిగింది.