మల్లారెడ్డి ఆస్తులపై విచారణ కోరతాం: ప్రభుత్వ విప్‌ లక్ష్మణ్‌కుమార్‌

-

మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి భూ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయనకు సంబంధించి మేడ్చల్‌ పరిసరాలలోని ఆస్తులపై విశ్రాంత న్యాయమూర్తితో విచారణ చేయించాలని ప్రభుత్వాన్ని కోరతామని ధర్మపురి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు.

హైదరాబాద్‌ జీడిమెట్ల డివిజన్‌ పరిధి సుచిత్ర కూడలి సమీపంలోని సర్వే నంబరు 82లో తొమ్మిది మందిమి కలిసి స్థలం కొన్నామని.. అందులో తనతోపాటు ఉప్పల్‌ మాజీ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి కూడా ఉన్నారని తెలిపారు. తన భూమిని 2021లో శ్రీనివాస్‌రెడ్డికి విక్రయించానని చెప్పిన లక్ష్మణ్.. అయినా మల్లారెడ్డి ఇప్పుడు తన పేరు ప్రస్తావిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై హైకోర్టును ఆశ్రయిస్తానని హైదరాబాద్‌ కొంపల్లిలోని హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు.

ఈ వివాద స్థలం విషయంలో మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్‌రెడ్డిల అనుచరులకు.. శ్రీనివాస్‌రెడ్డి అనుచరులకు మధ్య శనివారం ఘర్షణ వాతావరణం నెలకొని ఉద్రిక్తతకు దారితీసిన విషయం తెలిసిందే. పోలీసుల సూచన మేరకు ఈ స్థలంలో ఆదివారం రోజున కుత్బుల్లాపూర్‌ రెవెన్యూ అధికారులు సర్వే చేపట్టారు. సర్వే చేస్తున్న ప్రాంతానికి ఇరు వర్గాల అనుచరులను, మీడియాను పోలీసులు అనుమతించలేదు. సర్వే పూర్తయిన అనంతరం రెవెన్యూ అధికారులు నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news