‘అన్నా.. గతంలో ఆత్మహత్య చేసుకున్న నా చిన్నప్పటి దోస్త్ వారం రోజులుగా నా కలలోకి వస్తోంది. తన దగ్గరికి రమ్మంటోంది. నాకు భయంగా ఉందన్నా..’ అంటూ సోదరుడికి ఫోన్ చేసి చెప్పిన ఓ మహిళ ఆ తర్వాత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషాద ఘటన జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఖిలాషాపురంలో బుధవారం రోజున చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా ఖిలాషాపురం గ్రామానికి చెందిన రాధిక(33) యామంకి సుధాకర్‌కు ఓ కుమారుడు, కూతురు ఉన్నారు. అన్యోన్యంగా జీవించేవారు. రాధిక బుధవారం రోజున తన సోదరుడు శ్రీనివాస్‌తో ఫోన్లో మాట్లాడుతూ .. మూడేళ్ల కిందట ఆత్మహత్య చేసుకున్న తన స్నేహితురాలు ఇటీవల తరచూ తన కలలోకి వచ్చి తన దగ్గరికి రావాలంటోందని.. తనకు భయంగా ఉందంటూ చెప్పింది. వీటిని పట్టించుకోవద్దని ఆయన చెల్లెలికు ధైర్యం చెప్పినా.. భయంతో రాధిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది.