జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర వ్యాఖ్యలు చేసారు. తిరుపతి కార్యకర్తల సమావేశంలో మాట్లాడిన ఆయన జగన్ వంద రోజులు జైల్లో ఉండి అధికారంలోకి రాగా లేనిదీ… తాను ఎందుకు ప్రజా సమస్యలపై పోరాడలేను అని ప్రశ్నించారు. నేను రాజకీయాల్లోకి అన్ని తెగించి వచ్చాను అని స్పష్టం చేసారు. ప్రజా సమస్యలపై తాను ఎందుకు మొండిగా తిరగలేను అన్నారు. సమస్యలు ఎదురైతే కళ్ళకు గంతలు కట్టుకుని ఉండలేను అన్నారు. భావి తరాల అభ్యున్నతి కోసం అన్నీ వదులుకుని వచ్చాను అన్నారు.
జగన్ తన కులం మానవత్వం అన్నారు… అంటే ఇతర కులాలకు మానవత్వం లేదా ? అని ప్రశ్నించారు. చట్ట సభల్లో మాట్లాడే వారు చాలా జాగ్రత్తగా మాట్లాడాలని అన్నారు. మాతృ భాషను చంపేస్తుంటే తన గుండె తరుక్కు పోతోందని పవన్ అన్నారు. సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ లాంటి వారికి ఏ పదవి లేకపోయినా వారిని స్మరించుకుంటామని చెప్పుకొచ్చారు. తను మధ్య తరగతి నుంచి వచ్చి పార్టీ పెట్టాను అన్నారు. ప్రజాసమస్యలపై మాత్రమే స్పందిస్తాను అని స్పష్టం చేశారు. తన నుంచి అద్భుతాలు ఆశించవద్దని కోరారు.
రాయలసీమను కొన్ని బ్యాచ్‌లు కబ్జా చేశాయని ఆరోపించారు. రాయలసీమకు జగన్ చెడ్డ పేరు తెచ్చారని అన్నారు. భావితరాల కోసమే రాజకీయల్లోకి వచ్చాను అన్నారు. చట్టాల్లో మార్పులు తీసుకు రావాలని పవన్ అభిప్రాయపడ్డారు. జగన్ రెడ్డిని తాను ముఖ్యమంత్రిగా గుర్తించాను అన్నారు. రాయలసీమను చదువుల సీమగా మార్చాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆరు నెలల పాలనలో ఉల్లి పాయలు దొరకని పరిస్థితి ఉందన్నారు. చట్టాలు చేసే వారే బూతులు మాట్లాడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.