దక్షిణ తెలంగాణలో కరువు ఛాయాలకు కేసీఆర్ పాలనే కారణమని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మండిపడ్డారు. శ్రీశైలం స్వరంగం పనులు, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ఈరోజు రైతులు సాగునీరు లేక ఇబ్బంది పడేవారు కాదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తెలంగాణలో ప్రస్తుతం పరిస్థితులను చూస్తుంటే తెలంగాణ తెచ్చుకున్న ఆనందం కూడా లేకుండా పోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ సమగ్ర అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రాత్రి, పగలు పనిచేస్తుందని మంత్రి స్పష్టం చేశారు. కేసీఆర్ పదేళ్లలో ఉద్యోగాలు ఇవ్వలేదు, ఇల్లు కట్టలేదు, ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదని దుయ్యబట్టారు. రెండేళ్లలో తెలంగాణలో మార్పులు స్పష్టంగా కనిపిస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రైతాంగాన్ని రక్షించుకునేందుకు కర్ణాటక నుండి సాగునీరు తెచ్చే ప్రయత్నం చేసామని అక్కడ తీవ్ర కరువు పరిస్థితి ఉందన్నారు కోమటిరెడ్డి. ఏమాత్రం అవకాశం ఉన్నా, నాగార్జునసాగర్ నుండి సాగు నీటిని విడుదల చేయిస్తానని రైతులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హామీ ఇచ్చారు. అంతకుముందు ఆయన.. మహాశివరాత్రి సందర్భంగా నల్లగొండ పానగల్, పచ్చల సోమేశ్వరాలయాల్లో ఆయన అభిషేక పూజలు నిర్వహించారు.