తమ ప్రాంతం అభివృద్ధి చెందాలని కోరుకునే నాయకుడు.. వంశీచంద్‌రెడ్డి అని డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టివిక్రమార్క అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని కోరుకునే నేత ఆయన అని తెలిపారు. వంశీచంద్ ఎంపీ అయితే ఈ ప్రాంతాన్ని బాగా అభివృద్ధి చేస్తారనే నమ్మకం ఉందని పేర్కొన్నారు. నారాయణపేట జిల్లాలో పర్యటించిన భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి సంగంబండ ప్రాజెక్టును పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ నిర్వహించిన సభలో భట్టి ప్రసంగించారు.
“మక్తల్ నియోజకవర్గం వెనుకబడి ఉన్న ప్రాంతం. వైఎస్ హయాంలో మక్తల్ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేపట్టాం. సంగంబండ లోయర్ లెఫ్ట్ కెనాల్‌కు అడ్డుగా ఉన్న బండను పగలగొడతాం. సాగునీరు లేక ఎండిపోయిన పంటలు చూస్తే బాధ కలుగుతోంది. రూ.12 కోట్లు ఖర్చు చేసి బండ పగలగొడితే 25 వేల ఎకరాలకు సాగునీరు వస్తుంది. సంగంబండ కింద ఉన్న పంటలకు సాగునీరు పంపిస్తాం. మక్తల్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఇక్కడి ఎమ్మెల్యే రోజూ అడుగుతున్నారు. మక్తల్ నియోజకవర్గాన్ని సస్యశ్యామలం చేయాలని ఎమ్మెల్యే కోరుతున్నారు. వంశీచంద్‌రెడ్డి.. కాంగ్రెస్ పార్టీ ద్వారా ప్రజలకు సేవ చేస్తున్నారు. ఉమ్మడి పాలమూరుకు నిధులు తెచ్చేందుకు వంశీచంద్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు.” అని భట్టి అన్నారు.