మరోసారి గనుల వేలం.. టెండర్‌ వేసి దక్కించుకోవాలని సింగరేణి యోచన

-

మరోసారి గనులను వేలం వేయాలని కేంద్ర బొగ్గుశాఖ నిర్ణయించింది. ఈ విషయమై కేంద్ర ఎన్నికల సంఘాన్ని అనుమతి కోరగా గ్రీన్ సిగ్నల్ రావడంతో గనుల వేలం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ మేరకు కేంద్ర బొగ్గు శాఖ రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో కొత్త బొగ్గు గనులను దక్కించుకునేందుకు కేంద్ర బొగ్గుశాఖ నిర్వహించే వేలంలో పాల్గొనాలని సింగరేణి భావిస్తోంది. గత నాలుగేళ్లుగా రాష్ట్రంలో రెండు బొగ్గు గనులు ప్రైవేటు కంపెనీలు సొంతం చేసుకుంది. తెలంగాణలో కొత్తగా మరిన్ని గనులను వేలం వేయనున్నట్లు సమాచారం రాగా.. ఈ వేలంలో పాల్గొని గనులను దక్కించుకోవాలని  సింగరేణి సిద్ధమవుతోంది.

తెలంగాణ, ఏపీ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలే కాకుండా ఉత్తరాది రాష్ట్రాల విద్యుదుత్పత్తి కేంద్రాలు 2.40 లక్షల టన్నుల వరకు బొగ్గు కావాలని సింగరేణిని అడుగుతున్నాయి. ఇప్పుడున్న పాత గనుల్లో రోజువారీ ఉత్పత్తవుతున్న 2.20 లక్షల టన్నులే సరిపోక 20 వేల టన్నుల అమ్మకాలను సింగరేణి నష్టపోతోంది. ఇక ఈ నేపథ్యంలో తెలంగాణలో భారీ నిల్వలున్న కొత్త గనులను వేలంలో దక్కించుకోకపోతే మరో నాలుగైదేళ్లలో తీవ్ర బొగ్గు కొరత ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వానికి సంస్థ తెలిపింది. దీనివల్ల టెండరు వేసి వేలంలో గనులను కొంటే ఉత్పత్తి పెంచగలమని వివరించింది. ఈ నేపథ్యంలో కొత్త గనులను వేలంలో కొనడానికి సింగరేణి సిద్ధమవుతున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news