బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలుపొంది ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లిన కడియం శ్రీహరిపై మాజీ సీఎం, గులాబీ బాస్ కేసీఆర్ మండిపడ్డారు. కడియంపై అనర్హత వేటు ఖాయమని ఆయన అన్నారు. స్టేషన్‌ఘన్‌పూర్‌లో ఉపఎన్నిక రావడం తథ్యమని తేల్చి చెప్పారు. స్టేషన్ ఘన్ పూర్ శాసనసభ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ గా… మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్యకు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కేసీఆర్ ప్రకటించారు.
కడియం శ్రీహరిపై అనర్హత వేటు అనంతరం జరిగే స్టేషన్ ఘన్ పూర్ ఉపఎన్నికకు సిద్ధం కావాలని రాజయ్యకు కేసీఆర్ సూచించారు. హైదరాబాద్లో ఆదివారం రోజున బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను తాటికొండ రాజయ్య కలిశారు. ఈ సందర్భంగా వరంగల్ లోక్ సభ ఎన్నికల్లో… బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్ కుమార్ గెలుపు విజయం కోసం పనిచేయాలని రాజయ్యకు కేసీఆర్ సూచించారు. కడియం, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేసేలా… తమ పార్టీ తరపున పూర్తిగా పోరాడతామని కేసీఆర్ అన్నారు.