చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఘన విజయాన్ని అందుకుంది రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమలు’. మలయాళంలో రిలీజ్ అయిన ఈ చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ తో తెలుగులోనూ రిలీజ్ చేశారు. గిరీశ్ ఎ.డి. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నస్లెన్ కె.గఫూర్, మ్యాథ్యూ థామస్, మమితా బైజూ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని తెలుగులో రాజమౌళి తనయుడు ఎస్.ఎస్. కార్తికేయ మార్చిలో విడుదల చేసి సక్సెస్‌ను అందుకున్నారు.
ఈ సినిమాకు వచ్చిన పాపులారిటీ చూసి ఇప్పుడీ చిత్రానికి సీక్వెల్‌ను ప్రకటించారు. 2025లో దీన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం తెలిపింది. త్వరలోనే దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడించనున్నారు. థియేటర్లలో అలరించిన ప్రేమలు.. ప్రస్తుతం తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఇందులో నటించిన మమిత బైజు అందానికి, నటనకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ప్రేక్షకులే కాదు నిర్మాతలు కూడా ఈమె నటనకు మెస్మరైజ్ అయ్యారు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో వరుస అవకాశాలు అందుకుంటున్నట్లు టాక్ వినిపిస్తోంది.