ఇజ్రాయెల్ దాడులతో అతలాకుతలమైన గాజాలోకు అమెరికా, ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పెద్దన్నగా నిలుస్తున్నారు. గాజాకు మరింత సహాయ సామగ్రిని చేర్చే దిశగా అమెరికా చర్యలు చేపడుతోంది. యూఎస్ అధ్యక్షుడు బైడెన్, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ఆదివారం ఫోన్లో మాట్లాడారు. ఈ సందర్భంగా గాజాకు ఆహార పదార్థాలు, నిత్యావసరాలు సహా ఇతర సహాయ సామగ్రిని అనుమతించేందుకు మరిన్ని దారులను తెరుస్తామని నెతన్యాహు హామీ ఇచ్చారు.
ఈ వారంలోనే ఆ దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు ఇజ్రాయెల్ భద్రత విషయంలో అమెరికా ఏమాత్రం వెనకడుగు వేయబోదని… బైడెన్ హామీ ఇచ్చారు. కానీ రఫాలోని దాదాపు పది లక్షల మంది పాలస్తీనావాసులకు రక్షణ కల్పించని ఏ ఆపరేషన్‌కూ అమెరికా మద్దతు ఉండబోదని బైడెన్ తేల్చి చెప్పినట్లు శ్వేతసౌధం ప్రకటించింది.
హమాస్‌ను సమూలంగా నాశనం చేయడమే లక్ష్యంగా గాజాపై ఇజ్రాయెల్ విరుచుకు పడుతున్న విషయం తెలిసిందే. ఈ యుద్ధంతో గాజాలో తీవ్ర క్షామం నెలకొంది. సామాన్య ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడికి మానవతా సాయాన్ని అనుమతించాలని ప్రపంచ దేశాలు ఒత్తిడి తేవడంతో ఉత్తర సరిహద్దుల్లో మరికొన్ని దారులు తెరవడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది.