ధాన్యం అమ్మడానికి వెళ్లి.. వడదెబ్బతో కల్లం వద్దే రైతు మృతి చెందాడు. ఈ సంఘటన కరీంనగర్ లో చోటు చేసుకుంది. తెలంగాణలో భానుడి భగభగలతో ప్రజలు విలవిలలాడుతున్నారు. నిప్పుల కుంపటిని తలపిస్తున్న వాతావరణంతో అల్లాడుతున్నారు. ఈ ఏడాది మొదటిసారి 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉదయం నుంచే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నారు.
అయితే.. కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం రాగంపేట గ్రామానికి చెందిన రైతు రాజేశం (47) పది రోజుల క్రితం వడ్లు అమ్మడానికి వడ్ల కొనుగోలు కేంద్రానికి పంటను తీసుకెళ్ళాడు. వడ్లు అమ్మకం అవ్వకపోయే సరికి వడ్లను ఆరవెస్తున్న క్రమంలో వడదెబ్బకు గురై కల్లంలోనే కుప్పకూలి మృతి చెందాడు. వడదెబ్బతో మృతి చెందిన రాజేశం కూతురుకి నిన్న పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి మార్కులు రాగా.. తండ్రి కూతురి ఫలితాలు తెలియకుండానే మరణించడంతో గ్రామస్తులను కలచివేసింది.