మీ సమస్యలు తీరాలంటే ఈ వ్రతం చేయండి!

-

ప్రతి ఒక్కరికి ఏదో ఒక సమస్య. ఆరోగ్యం, విద్య, రుణబాధలు, ఈతి బాధలు, ఆటంకాలు ఇలా రకరకాల సమస్యలు. అయితే వీటన్నింటిని దూరం చేసే అత్యంత పవిత్రమైన వ్రతం, అందరూ చేసుకోవడానికి అనుకూలమైన వ్రతం ఒక్కటి ఉంది దాని గురించిన వివరాలు తెలుసుకుందాం…

ప్రతి నెల వచ్చే బహుళ చతుర్ధశిని “సంకటహర చతుర్ధి” అని అంటారు. ఈ పర్వదినాన వినాయకుడిని అర్చిస్తే సకల కష్టాలు దూరమవుతాయి. ప్రతి మాసంలో వచ్చే సంకటహర చతుర్థి రోజున వినాయకునికి నిష్టతో పూజించి ఉండ్రాళ్లు నైవేద్యముగా సమర్పించే వారికి ఈతిబాధలు తొలగిపోతాయని విశ్వాసం.
ఏం చేయాలి?

సంకటహర చతుర్ధి నాడు సూర్యోదయానికి ముందే లేచి, శుచిగా స్నానమాచరించి, ఇంటిని, పూజగదిని శుభ్రం చేసుకోవాలి.పసుపు, కుంకుమలు, పుష్పాలతో పూజామందిరమును దివ్య సుందరముగా అలంకరించుకుని పూజకు సిద్ధం చేసుకోవాలి. అదే రోజున వినాయకుని ఆలయాల్లో జరిగే అభిషేకాలు, ప్రత్యేక పూజలు పూర్తయ్యాక విఘ్నేశ్వరుని దర్శించుకోవాలి.ఇంకా సంకట హర చతుర్ధినాడు ఆలయాల్లో జరిగే అభిషేకాలకు సుగంధ ద్రవ్యాలు, పుష్పాలు, గరిక మాల వంటివి సమర్పించుకుంటే సకల సంపదలు, సుఖసంతోషాలు చేకూరుతాయి. సంకట చతుర్థి నాడు సాయంత్రం చంద్రదర్శనం చేసుకున్నతర్వాత పూజచేసుకుని గణపతికి పూజాదికాలు చేసి నివేదన చేసిన అనంతరం భోజనం చేయాలి.అంటే సంకట చతుర్థినాడు ఏక భుక్తం అదీ రాత్రి పూట చేస్తే చాలా విశేషం. అదేవిధంగా గరిక, ఉండ్రాళ్లు, ఎర్రటి పూలతో గణపతి ఆరాధన చేస్తే మంచిది.

అదే రోజు ఆరు గంటలకు ఇంట్లో దీపం వెలిగించి వినాయక ప్రతిమ లేదా ఫోటోను గరికమాలను అలంకరించుకుని, పంచ హారతినిచ్చి నైవేద్యం సమర్పించుకునే వారికి ఆర్థిక వృద్ధి, వ్యాపారాభివృద్ధి, ఉన్నత పదవులు వంటి శుభ ఫలితాలుంటాయని శాస్త్ర వచనం.

వృతం చేసే విధానాన్ని దగ్గర్లోని పురోహితులను లేదా పండితుల వద్ద తెలుసుకుని ఆచరిస్తే మంచిది. సాయంత్రం దాకా భోజనం చేయకుండా ఉండలేని వారు పొద్దునే పూజాదికాలు చేసుకుని భోజనం చేసి, రాత్రి అల్పాహారం లేదా పండ్లు పాలు తీసుకుని ఉండవచ్చు. ఎవరి శక్తి మేరకు వారు గణపతిని ఆరాధిస్తే తప్పక వారి బాధలు తీరుతాయని పండితులు పేర్కొంటున్నారు.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news