దేశంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఎలాంటి లబ్ధి చేకూరుతుందో తెలియజెప్పే మేనిఫెస్టోను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ విడుదల చేయనున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ వేదికగా 23 అంశాలతో కూడిన మేనిఫెస్టో విడుదల చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు కేంద్రంలో కాంగ్రెస్ అధికార పగ్గాలు చేపడితే . రాష్ట్రానికి ఐటీఐఆర్ పునరుద్ధరణ, కాజీపేట రైల్వే కోచ్ ప్యాక్టరీ, బయ్యారంలో ఉక్కు కర్మాగారం, ఐఐఎం, విజయవాడ జాతీయ రహదారి పక్క నుంచి రాపిడ్ రైల్యే వ్యవస్థ, మైనింగ్ విశ్వవిద్యాలయం.. తదితర అంశాలు ఉన్నట్లు సమాచారం.
జాతీయ కాంగ్రెస్ ప్రకటించిన 5 న్యాయాలతో పాటు.. ఇవాళ మేనిఫెస్టోలో ప్రకటించే అంశాలు రాష్ట్రానికి ప్రత్యేకించినవని పీసీసీ స్పష్టం చేసింది. ఇప్పటికే ఆరు గ్యారంటీలు, ఇతర హామీలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న హస్తం నేతలు.. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన తర్వాత రాష్ట్రానికి ప్రత్యేకించిన మేనిఫెస్టోను ఇంటింటికి విస్తృతంగా తీసుకెళ్లనున్నారు.