మహిళ కిడ్నాప్ కేసులో అరెస్టైన మజీ ప్రధాని HD దేవెగౌడ కుమారుడు ఎమ్మెల్యే రేవణ్ణను ప్రత్యేక దర్యాప్తు బృందం-సిట్ అధికారులు జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు. నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీలో ఉన్న రేవణ్ణను అధికారులు అదనపు మెట్రోపాలిటన్ న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. కోర్టు అతనికి మే 14 వరకు రిమాండ్‌ను విధించింది. దేవగౌడ కుటుంబం నుంచి క్రిమినల్ కేసులో జైలుకు వెళ్లిన తొలి వ్యక్తిగా మచ్చ తెచ్చుకున్న రేవణ్ణ, కోర్టు నుంచి బయటికి వస్తూ.. కంటతడి పెట్టుకున్నారు.
ఈ మేరకు సిట్ అధికారుల రేవణ్ణను తమ కస్టడీలోకి తీసుకున్నారు. గతంలో రేవణ్ణ ఇంట్లో పనిచేసిన తన తల్లి కిడ్నాప్‌కు గురైందని బాధితురాలి కుమారుడు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో కిడ్నాప్, అక్రమంగా బంధించటం వంటి సెక్షన్ల కింద రేవణ్ణపై కేసు నమోదైంది. మరోవైపు రేవణ్ణ కుమారుడు ప్రజ్వల్ రేవణ్ణపై లైంగిక వేధింపుల ఆరోపణలపై సిట్ అధికారులు కేసు నమోదు చేశారు. ప్రస్తుతం ప్రజ్వల్ విదేశాల్లో తలదాచుకున్నారు.