ఈశాన్య ఉక్రెయిన్‌లోని ఖర్కీవ్ ప్రాంతాన్ని ఆక్రమించే ప్రణాళికలు లేవని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. ఆ ప్రాంతంలో బఫర్ జోన్ ఏర్పాటే అక్కడ తమ తాజా దాడుల లక్ష్యమని తెలిపారు. చైనాలోని హార్బిన్‌లో శుక్రవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ.. తమ దేశంలోని బెల్‌గొరోద్ ప్రాంతంపై ఉక్రెయిన్ ఇటీవల షెల్‌లతో విరుచుకుపడిన సంగతిని గుర్తు చేశారు. దానికి బదులుగానే తాము ఖర్కీవ్‌పై ఈ నెల 10 నుంచి ఉద్ధృతంగా దాడులు చేస్తున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో మాస్కో బలగాలు ప్రణాళిక ప్రకారమే దూసుకెళ్తున్నాయని పేర్కొన్నారు.
చైనాలో రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పర్యటన శుక్రవారంతో ముగిసింది. తన పర్యటనలో భాగంగా చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో ఆయన పలు అంశాలపై చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య వ్యూహాత్మక సహకార భాగస్వామ్యాన్ని కొనసాగించుకోవడంపై దార్శనిక పత్రాన్ని విడుదల చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధానికి చర్చల ద్వారా ముగింపు పలికేందుకు తాము సిద్ధమేనని పేర్కొన్న పుతిన్.. అమెరికా నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతున్నప్పటికీ రష్యా-చైనా వ్యూహాత్మక సంబంధాలు ప్రస్తుతం చరిత్రాత్మక ఆరంభ కేంద్రం వద్ద ఉన్నాయని జిన్‌పింగ్ అన్నారు.