హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారని ప్రముఖ మీడియా హౌజ్ రాయిటర్స్ ప్రకటించింది. ఆయనతో పాటు ప్రయాణిస్తున్న విదేశాంగ మంత్రి హొస్సేన్ అమీరబ్దొల్లహియన్, తూర్పు అజర్బైజాన్ ప్రావిన్సు గవర్నర్ మలేక్ రహ్మతీ తదితరులు మరణించినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా వర్గాలు ధ్రువీకరించాయి.
అజర్ బైజాన్ సరిహద్దుల్లోని జోల్ఫాలో ఆదివారం రోజున రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలిన విషయం తెలిసిందే. ఇరాన్-అజర్బైజాన్ సరిహద్దుల్లో కిజ్ కలాసీ, ఖొదావరిన్ అనే రెండు డ్యాంలను ప్రారంభించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
సహాయక చర్యలు చేపట్టిన ‘ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ’ (IRCS) ఈ ఉదయం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని గుర్తించింది. సోమవారం ఉదయం దాదాపు రెండు కిలోమీటర్ల దూరం నుంచి కనిపెట్టినట్లు పేర్కొంది. అయితే ఆ ప్రాంతంలో ఎవరూ బతికి ఉన్న ఆనవాళ్లు కనిపించడం లేదని అధికారులను ఉటంకిస్తూ ఆ దేశ ప్రభుత్వ వార్తాసంస్థ ఐఆర్ఎన్ఏ వెల్లడించింది. అంతకుముందు ప్రమాదస్థలానికి సంబంధించిన కచ్చితమైన భౌగోళిక కోఆర్డినేట్లను మానవరహిత విమాన (UAV) గాలింపులో కనుగొన్నట్లు తెలిపింది.