అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటారన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన బయోపిక్ కూడా వివాదాస్పదమైంది. ట్రంప్ బయోపిక్ ప్రీమియర్ షో ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ‘ది అప్రెంటిస్’ పేరిట వచ్చిన ఈ చిత్రంలో పలు సన్నివేశాలు వివాదాస్పదంగా ఉన్నాయని ఆయన బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని కోర్టులో సవాల్ చేస్తామని తెలిపింది..
1970, 1980లలో ట్రంప్ అమెరికా స్థిరాస్తి వ్యాపారంలో ఎలా ఎదిగారో ఈ సినిమాలో చూపించారు. ఇందులో కొన్ని సన్నివేశాలు కల్పితమని.. మాజీ అధ్యక్షుడి ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని ఆయన ప్రచార బృందం ఆరోపించింది. తన మొదటి భార్య ఇవానాను ట్రంప్ అత్యాచారం చేసినట్లుగా చూపడం ఇప్పుడు వివాదానికి తెరతీసింది. నిజజీవితంలో విడాకుల ప్రక్రియ కోర్టులో ఉన్న సమయంలో తనపై ఆయన అత్యాచారానికి పాల్పడ్డట్లు ఇవానా ఆరోపించి.. తర్వాత వాటిని వెనక్కి తీసుకున్నారు. 2022లో ఆమె మరణించిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పాత్రను మరియా బకలోవా పోషించారు. ట్రంప్ టీమ్ ఈ సినిమాను చెత్త చిత్రంగా కొట్టిపారేసింది. హాలీవుడ్ ప్రముఖుల కుట్రగా అభివర్ణించింది.