దక్షిణ గాజా నగరమైన రఫాలో ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ ‘కళ్లన్నీ రఫాపైనే (All Eyes On Rafah)’ అనే ఫొటో నెట్టింట బాగా ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఇజ్రాయెల్ తీవ్రంగా స్పందించింది. అక్టోబర్ 7న మీ కళ్లు ఎక్కడున్నాయి (Where Were Your Eyes on October 7)? అంటూ ప్రశ్నించింది. గతేడాది అక్టోబరు 7న తమ దేశంపై హమాస్ ముష్కరులు దాడి చేసి అనేక మంది అమాయకుల ప్రాణాలను బలిగొన్నప్పుడు ఎందుకు స్పందించలేదని నిలదీసింది.
ఆ రోజు తమ దేశంలో చోటుచేసుకున్న నరమేధం తీవ్రతను ప్రతిబింబించే దృశ్యాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ‘‘మేం అక్టోబరు 7 గురించి మాట్లాడటం ఎప్పటికీ ఆపం. హమాస్ చేతుల్లో బందీలుగా ఉన్నవారంతా విడుదలయ్యేదాకా మా పోరాటాన్ని నిలిపివేయం’’ అని స్పష్టం చేసింది. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై హమాస్ జరిపిన దాడిలో దాదాపు 1,160 మంది ప్రాణాలు కోల్పోగా.. 250 మంది బందీలుగా మారిన విషయం తెలిసిందే.