గాజాలో ఇజ్రాయెల్ యుద్ధం ఆపితే కాల్పుల విరమణ ఒప్పందానికి తాము సిద్ధంగా ఉన్నామని హమాస్ మరోసారి స్పష్టం చేసింది. అప్పటి వరకు తాము ఎలాంటి సంధి చర్చల్లో పాల్గొనబోమని తేల్చి చెప్పింది. ఈ విషయాన్ని ఒప్పందం కోసం యత్నిస్తున్న మధ్యవర్తులకు తెలియజేశామని వెల్లడించింది.
ఇజ్రాయెల్, హమాస్ మధ్య సంధి కోసం ఈజిప్టు, ఖతార్, అమెరికాకు చెందిన ప్రతినిధులు గతకొన్ని నెలలుగా మధ్యవర్తిత్వం వహిస్తున్నారు. ఇప్పటికే పలుసార్లు ఆ దిశగా జరిపిన ప్రయత్నాలు విఫలమైన విషయం తెలిసిందే. ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సంధికి విముఖత వ్యక్తం చేయగా.. ఇటీవల రఫాలో ఇజ్రాయెల్ చేసిన దాడి తీవ్ర ప్రాణ నష్టానికి దారితీసిన తరుణంలో హమాస్ నుంచి ఈ ప్రకటన వెలువడింది. ఐరాస, అంతర్జాతీయ న్యాయస్థానం వారించినా.. ఇజ్రాయెల్ దాడులకు పాల్పడుతుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు ఇజ్రాయెల్ మాత్రం పూర్తి విజయం సాధించే వరకు యుద్ధంపై వెనక్కి తగ్గేది లేదని పునరుద్ఘాటిస్తోంది.