ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని.. వైసీపీ చీఫ్ జగన్ ధైర్యం చెప్పారు. ఇవాళ జగన్ అధ్యక్షతన తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటమి కేవలం ఇంటర్వెల్ మాత్రమేనని పేర్కొన్నారు. శకుని పాచికల మాదిరిగా ఎన్నికలఫలితాలు వచ్చాయి. కృష్ణుడు తోడుగా ఉన్నా పాండవులు అప్పడప్పుడూ ఓడిపోయారు. చివరికీ ప్రతీ ఒక్కరూ అర్జునుడిలా విజయం సాధిస్తారు. కార్పొరేటర్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. మరో నాలుగేళ్ల వరకు అవిశ్వాసం పెట్టే అవకాశం లేదు. 40 శాతం మంది ప్రజలు మన వైపే ఉన్నారు.
ఎన్నికల తరువాత కొంత మంది పై కొన్ని ప్రాంతాల్లో కార్యకర్తలపై, నేతలపై దాడులు జరుగుతున్నాయని తెలిపారు. దాడులు జరుగుతున్నాయని అధికారులకు చెప్పినప్పటికి వాటి గురించి పట్టించుకోవడం లేదన్నారు. వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ దాడుల్లో గాయపడిన వారిని, వైసీపీ ఓటమి కారణంగా మరణించిన వారిని పరామర్శించనున్నారు మాజీ సీఎం జగన్. ఈ ఏడాది డిసెంబర్ నుంచి ఆయన మళ్లీ ఓదార్పు యాత్ర చేయనున్నట్టు సమాచారం. ఈ మేరకు పార్టీ వర్గాలు వెల్లడించాయి.