తిరుమలలో మఠాల పేరుతో భక్తులను దోపిడీ చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు తిరుపతి జనసేన ఇన్ చార్జ్ కిరణ్ రాయల్. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వీటిపై చర్యలు తీసుకోకుంటే అసాంఘిక కార్యక్రమాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. ఈ విషయం పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తామని.. టీటీడీ ఈవోని కలిసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు.
ఈ తరుణం లోనే తిరుపతి వైసీపీ ఇన్ ఛార్జి భూమన అభినయ్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్‌కు చేసిన రాజీనామా ను ఎందుకు పబ్లిసిటీ చేయలేదని ప్రశ్నించారు. తిరుమలలో అన్ని చోట్లా అవినీతి జరిగిందని ఆరోపించారు. ఎవరు అయితే అన్యాయంగా, అక్రమంగా దోచుకున్నారో వారందరినీ బయట పెడతామన్నారు. తిరుమల నుంచే ప్రక్షాళన మొదలు పెడతామని.. రవీంద్ర బాబు అనే వ్యక్తి కనుసన్నల్లోనే తిరుమలలో పలు మఠాలు నడుస్తున్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారాలు అన్ని అత్యంత త్వరలోనే వెలుగులోకి రానున్నట్టు వెల్లడించారు.