ప్రస్తుతం పార్లమెంట్ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాల సందర్భంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాజ్యసభ సభ్యురాలు, ఛత్తీస్గఢ్ కి చెందిన సీనియర్ నాయకురాలు పూలోదేవి నేతమ్ సభలో కళ్లుతిరిగి పడిపోయారు. నీట్ పరీక్షలో అవకతవకలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ సభ్యులంతా రాజ్యసభ ఛైర్మన్ పోడియం దగ్గరికి వెళ్లి నిరసన వ్యక్తం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
పూలోదేవి కళ్లు తిరిగి కింద పడిపోగానే అక్కడ ఉన్న సభ్యులు, రాజ్యసభ సిబ్బంది హుటాహుటిన ఆమెను అంబులెన్స్లోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెతో పాటు మరికొందరు మహిళా ఎంపీలు కూడా వెళ్లారు. ప్రస్తుతం ఆమె ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అంతకు ముందు లోక్ సభలో నీట్ పరీక్ష రద్దు చేయాలంటూ పెద్ద ఎత్తున విపక్ష ఎంపీలు నిరసన చేపట్టారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా లోక్ సభను సోమవారానికి వాయిదా వేశారు.