నీట్ యూజీ 2024 అభ్యర్థుల ర్యాంకులను ఎన్‌టీఏ సవరించి విడుదల చేసింది. 1563 మంది అభ్యర్థుల ర్యాంకులను సవరించి తాజాగా నీట్ ఫలితాలు ప్రకటించింది. ఈ మేరకు నీట్ యూజీ 2024 అభ్యర్థులందరి ర్యాంకులు సవరించినట్లు ఎన్‌టీఏ తెలిపింది. గత నెల 23వ తేదీన 1563 మందికి మరోసారి పరీక్ష నిర్వహించగా… 813 మంది హాజరైనట్లు పేర్కొంది. అన్ని ప్రశ్నలకు సమాధానాలతో ఫైనల్ కీని వెబ్ సైట్‌లో ఉంచినట్లు వెల్లడించింది. ఫైనల్ స్కోర్ కార్డ్‌లు exams.nta.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని ఎన్టీఏ పేర్కొంది.
నీట్ పరీక్షలో అవకతవకలు, ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. దీన్ని తీవ్రంగా పరిగణించిన కేంద్రం దర్యాప్తునకు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు ముమ్మరం చేసిన సీబీఐ ఝార్ఖండ్‌లోని హజారీబాగ్‌లో ఒయాసిస్ స్కూల్ ప్రిన్సిపల్ ఎహ్‌సానుల్, వైస్‌ప్రిన్సిపల్ ఇంతియాజ్ ఆలంను అరెస్టు చేసింది. హజారీబాగ్ నగరంలో జరిగిన నీట్ పరీక్ష నిర్వహణకు ఎహ్‌సానుల్, ఎన్టీఏ అబ్జర్వర్, ఒయాసిస్ స్కూల్ పరీక్ష కేంద్రానికి, ఎన్ ఇంతియాజ్ ఆలం సమన్వయకర్తగా వ్యవహరించారని సీబీఐ అధికారులు వెల్లడించారు. ఇదే కేసులో జిల్లాకు చెందిన మరో అయిదుగురిని ప్రశ్నించారు.