రూ.2లక్షల రుణమాఫీ పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన

-

రైతులకు ఇచ్చిన హామీలను తూచా తప్పకుండా అమలు చేయాలనే అంకిత భావంతో తమ ప్రభుత్వం పని చేస్తుందని.. త్వరలోనే రైతులు శుభవార్త వింటారని డిప్యూటీ సీఎం, రైతు భరోసా కేబినెట్ సబ్ కమిటీ చైర్మన్ భట్టి విక్రమార్క తెలిపారు. ఇవాళ హైదరాబాద్ లోని గాంధీభవన్ లో మీడియాతో భట్టి మాట్లాడారు.  రైతు భరోసా మొత్తం నిజమైన రైతులకు, వ్యవసాయ అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలనేదే తమ ప్రభుత్వ ఆలోచన అని అన్నారు. రైతు భరోసాపై విధివిధానాల కోసం రాష్ట్ర ప్రభుత్వం సబ్ కమిటీ ఏర్పాటు చేసిందని నాలుగు గోడల మధ్య కూర్చుని విధివిధానాలు తాము రూపొందించబోమన్నారు.

రైతు భరోసా విధివిధానాలపై పాత ఉమ్మడి జిల్లాల వారీగా సమావేశాలు ఏర్పాటు చేసి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరిస్తామని చెప్పారు. రైతులు, ట్యాక్స్ పేయర్స్, మీడియా, మేధావులతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. బడ్జెట్ సమావేశాల్లోపే రిపోర్టును సిద్ధం చేసి ఆ నివేదికను అసెంబ్లీలో చర్చకు పెడుతామన్నారు. త్వరలోనే రైతు రుణమాఫీ చేసి తీరుతామని పేర్కొన్నారు. ఐదు ఎకరాలలోపు వారికే రైతు భరోసా ఇస్తారనే ప్రచారం జరుగుతోందన్న మీడియా ప్రశ్నకు బదులిస్తూ ఇలాంటి ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దన్నారు. రైతు భరోసా విషయంలో ఎలాంటి ఆలస్యం జరగదని జూలై 15 నాటికి నివేదిక సమర్పిస్తామని, విధివిధానాల రూపకల్పన ప్రక్రియ అంతా బడ్జెట్ సమావేశాలలోపు పూర్తి అవుతుందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news