భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రష్యాలో పర్యటించారు. రెండ్రోజుల పర్యటన నిమిత్తం అక్కడికి వెళ్లిన మోదీకి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ రష్యన్ అత్యున్నత పౌర పురస్కారమైన ‘ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్’ను ప్రదానం చేశారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరచడంలో చేసిన సేవలకు గానూ మోదీని ఈ మేరకు సత్కరించినట్లు పుతిన్ తెలిపారు.
మరోవైపు ఈ పురస్కారాన్ని స్వీకరించడం తనకు గౌరవంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. ఈ పురస్కారాన్ని భారత ప్రజలకు అంకితమిస్తున్నట్లు ఎక్స్ వేదికగా తెలిపారు. అయితే, ఈ అవార్డును 2019లోనే ప్రధాని మోదీకి ప్రకటించగా, మంగళవారం రోజున రష్యాలో పర్యటించిన సందర్భంగా మోదీ, పుతిన్ చేతుల మీదుగా అందుకున్నారు.
మరోవైపు రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి, ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ప్రైవేటు విందు ఇచ్చారు. సోమవారం రాత్రి “ఇద్దరు స్నేహితులు, విశ్వసనీయమైన భాగస్వాముల కలయిక అపూర్వం. మోదీని పుతిన్ ఘనంగా తన ఇంట్లోకి ఆహ్వానించారు” అని భారత విదేశాంగశాఖ ఎక్స్‌లో పేర్కొంది.