జాతీయ రహదారులకోసం సేకరించిన భూములకు పరిహారం చెల్లించే విషయంలో మానవతా దృక్పథంతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జాతీయ రహదారుల సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) పరిధిలో రోడ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలపై సచివాలయంలో సీఎం బుధవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం నుంచి సహకారం ఉన్నా భూసేకరణ ఎందుకు ఆలస్యమవుతోందని ప్రశ్నించగా.. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలు తక్కువ ఉండటం, మార్కెట్ ధరలు ఎక్కువగా ఉండటంతో భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు రావడం లేదని జిల్లా కలెక్టర్లు తెలిపారు.
దీనిపై ముఖ్యమంత్రి స్పందిస్తూ తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలని చెప్పారు. వారి ఆవేదనను పరిగణనలోకి తీసుకుని పరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రైతులతో కలెక్టర్లు స్వయంగా మాట్లాడి ఒప్పించాలని.. నిబంధనల ప్రకారం రైతులకు ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత దక్కేలా చూడాలని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.