యూజీసీ నెట్ పరీక్షలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఆ ప్రశ్నపత్రం వక్రీకరించిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసిన ఓ విద్యార్థిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనుంది. ఈ స్క్రీన్‌షాట్ ఆన్‌లైన్‌లో వైరల్ కావడంతో కేంద్ర విద్యాశాఖ పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే.
లీకైన ఆ క్వశ్చన్ పేపర్ వక్రీకరించినదని, ఆ స్క్రీన్‌షాట్ ఆన్‌లైన్‌లో చక్కర్లు కొట్టడం వెనక ఒక పాఠశాల విద్యార్థి ఉన్నారని అధికారులు గుర్తించారు. ఒక యాప్ ద్వారా ఇదంతా చేశాడని తెలిపారు. దానిపై డేట్‌ను జూన్ 17గా మార్చి.. తనవద్ద తర్వాత పరీక్ష ప్రశ్నపత్రం కూడా ఉందని నమ్మించి, కొంత డబ్బు సంపాదించేందుకే దాన్ని వైరల్ చేసినట్లు వెల్లడించారు. అది మార్పులు చేసిన పేపర్ అని ఫోరెన్సిక్ నిపుణులు గుర్తించినట్లు తెలిపారు. ఆ విద్యార్థిపై ఛార్జ్‌షీట్ దాఖలు చేయనున్నట్లు చెప్పారు. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్‌కు అర్హత సాధించడానికి, పీహెచ్‌డీల్లో ప్రవేశాలకు, విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాలకు అర్హత కోసం జూన్ 18న దేశవ్యాప్తంగా యూజీసీ నెట్ పరీక్ష రెండు షిఫ్ట్‌ల్లో నిర్వహించిన విషయం తెలిసిందే.