2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్ అవతరించాలన్న ప్రధాని మోదీ ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మిగిలిన 8 నెలల కాలానికి కాసేపట్లో వార్షిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను సమర్పించనున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ డిజిటల్ బ్యాట్తో నిర్మలమ్మ పార్లమెంటుకు చేరుకున్నారు. పార్లమెంటులో కేంద్ర కేబినెట్ సమావేశమైంది. ప్రధాని అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్ 2024-25 వార్షిక బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది.
ఇక కాసేపట్లో లోక్సభలో నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. ఈ సారి పద్దు ప్రవేశపెడితే వరసగా ఏడుసార్లు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన ఘనతను నిర్మల సాధించబోతున్నారు. నిత్యావసరాలు సహా అన్నింటి ధరలు మండిపోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో మధ్యతరగతి ప్రజల పన్ను ఉపశమనాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అభివృద్ధి సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని, వృద్ధికి ఊతమిచ్చి ద్రవ్యోల్బణం నియంత్రణకు ప్రాధాన్యం ఇవ్వాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.