ఇలాంటి తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నా: సీఎం రేవంత్‌రెడ్డి

-

తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే.. కంటోన్మెంట్‌ దివంగత ఎమ్మెల్యే లాస్య నందిత మృతికి సంతాపంగా తీర్మానం ప్రవేశపెట్టిన సీఎం రేవంత్‌రెడ్డి.. ఇలాంటి బాధాకరమైన తీర్మానం ప్రవేశపెట్టాల్సి వచ్చినందుకు చింతిస్తున్నట్లు చెప్పారు. లాస్య నందిత తండ్రి సాయన్న తనకు అత్యంత సన్నిహితులు, ఆప్తులు అని తెలిపారు. చాలా సంవత్సరాలు ఆయనతో కలిసి పనిచేసినట్లు గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యేలుగా ప్రజాక్షేత్రంలో పనిచేశామని వెల్లడించారు.

“ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే సాయన్న మరణించడంతో తండ్రి వారసత్వాన్ని, బాధ్యతలను నెరవేర్చేందుకు ఆయన కుమార్తె లాస్య నందిత ప్రజాజీవితంలోకి వచ్చారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కంటోన్మెంట్ ప్రజలు, మహిళల తరఫున చిత్తశుద్ధితో పోరాడతారని భావించాం. కానీ దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించారు. కంటోన్మెంట్‌ ప్రజల హృదయాల్లో సాయన్న, లాస్య నందిత శాశ్వతంగా నిలిచిపోతారు. వారు చేయాలనుకున్న పనులను ఈ ప్రభుత్వం పూర్తిచేస్తుంది. ఆమె మృతిపట్ల సంతాపం ప్రకటిస్తున్నాను. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’’ అని సీఎం రేవంత్‌ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news