వచ్చే నెలలో రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తమ ప్రభుత్వం చేసిన రుణమాఫీ దేశంలోనే రికార్డు అని తెలిపారు. గతంలో ఏ రాష్ట్రం కూడా ఇంత రుణమాఫీ ఒకేసారి చేయలేదని పేర్కొన్నారు. దీని ద్వారా రైతులకు అండగా ఉంటామనే విశ్వాసం కల్పించామని చెప్పారు. రైతులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ కాదు.. ఫుల్‌టైమ్ సెటిల్మెంట్ చేశామని అన్న రేవంత్ రెడ్డి.. గత ప్రభుత్వం చేసిన అప్పులకు రూ.43 వేల కోట్ల వడ్డీ కట్టామని వెల్లడించారు. ఆర్థిక కష్టాలున్నా రైతులకు మేలు చేసిన భట్టికి అభినందనలు తెలిపారు.
“వాణిజ్య, వ్యవసాయ బ్యాంకుల నుంచి కూడా వివరాలు సేకరించాం. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా రుణమాఫీ చేసి తీరాలని చెప్పాను. రైతు రుణమాఫీ మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం. దేశ భద్రత, ఆహార భద్రతకు మా పార్టీ ప్రాముఖ్యత ఇచ్చింది. రైతుల కష్టాలను గుర్తించే నెహ్రూ ఆనాడు సాగునీటి ప్రాజెక్టులు నిర్మించారు. రైతుల మేలు కోసమే ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయకరణ చేశారు. విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్లు ఇచ్చిన ఘనత మా పార్టీదే. పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చి రైతులను ఆదుకున్నది మా పార్టీ. ఆరు గ్యారంటీల అమలుకు మంత్రులందరూ నాకు అండగా నిలబడ్డారు. రైతుల పట్ల మా చిత్తశుద్ధిని ఎవరూ ప్రశ్నించలేరు.” అని సీఎం రేవంత్ అన్నారు.