సాధారణంగా పాఠశాలల్లో విద్యార్థులు.. ఉపాధ్యాయులు కనిపించగానే గుడ్ మార్నింగ్ అని చెబుతుంటారు. తోటి స్నేహితులకు హాయ్ అని పలకరిస్తుంటారు. అయితే ఈ రెండు మన భారతీయ సంప్రదాయం కాదని కొందరి వాదన. ఈ క్రమంలోనే పలకరింపుగా వీటి స్థానాల్లో జైహింద్ అని చెప్పాలని చాలా మంది ఇప్పటికే సూచన చేశారు. అయితే హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని హర్యానా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆగస్టు 15 నుంచి రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లోని విద్యార్థులు టీచర్లకు, తోటి స్నేహితులకు పలకరింపుగా ‘గుడ్ మార్నింగ్’ చెప్పకూడదని.. దానికి బదులుగా ఇక నుంచి అందరూ ‘జై హింద్’ అని చెప్పాలని సూచించింది. ఈ మేరకు పాఠశాల విద్య డైరెక్టరేట్ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థుల్లో చిన్ననాటి నుంచే దేశభక్తి, దేశంపై గౌరవం, ఐక్యతా భావాలను పెంపొందించాలనే ఆలోచనతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. ఆగస్టు 15న జాతీయ జెండాను ఎగురవేసే ముందు నుంచి ఈ సూచనలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు.