రెండో విడ‌త నామినేటెడ్ ప‌ద‌వుల పంప‌కం.. సిద్ధ‌మైన జాబితా

-

తెలంగాణలో కాంగ్రెస్ నేతలకు మ‌రోసారి పదవుల పంప‌కానికి అంతా సిద్దమైంది. రెండో విడత నామినేటెడ్ పదవుల జాబితా ఖరారు చేసిన‌ట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుంచి వచ్చిన తరువాత జాబితాను అధికారికంగా ప్రకటించనున్నారు. అటు ఏఐసీసీ పెద్ద‌లు కూడా నామినేటెడ్ పదవుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన‌ట్లు స‌మాచారం. ఇంకో విష‌యం ఏమిటంటే టీపీసీసీకి కొత్త సారధితో పాటుగా మంత్రివర్గ విస్తరణ పైన పార్టీ నాయకత్వం తుది నిర్ణయం తీసుకునేందుకు సిద్ధ‌మైంది.

సుదీర్ఘ చ‌ర్చ‌ల త‌రువాత అధిష్టానం ఓ నిర్ణ‌యానికి వ‌చ్చింది. ముందుగా నామినేటెడ్ ప‌ద‌వుల‌ను పూర్తి చేసి ఆ త‌రువాత మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ‌పై దృష్టిపెట్టాల‌ని సీఎంకి ఆదేశాలు ఇచ్చిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. దీంతో నామినేటెడ్ ప‌ద‌వుల‌ను పూర్తి చేసేందుకు సీఎం రేవంత్ క‌స‌ర‌త్తు పూర్తి చేశారు. విదేశాల నుంచి వ‌చ్చాక ఆ జాబితా ప్ర‌క‌టించేందుకు నిర్ణ‌యించుకున్నారు.

మొదటి విడతలో 37 పోస్టులకు ఛైర్మ‌న్‌ల‌ను, మెంబ‌ర్ల‌ను ప్ర‌క‌టించారు. ఇక రెండో విడత కార్పొరేషన్ పదవుల పంపకానికి రంగం సిద్ధమైన నేప‌థ్యంలో కీలకమైన కార్పొరేషన్ పదవుల భర్తీతో పాటు.. ప్రభుత్వం కొత్తగా రైతు, విద్య కమిషన్లు ఏర్పాటు చేయనుంది. వాటితో పాటు బిసీ కమీషన్ భర్తీ ఏర్పాటు దిశగా తుది కసరత్తు చేస్తున్నారు. మ‌లి విడ‌త‌ పదవుల కోసం అటు నేతలు కూడా లాబీయింగ్ ముమ్మరం చేసారు. తొలి విడతలో మహిళా, ఫైనాన్స్ కమిషన్‌లకు చైర్మన్లను, మెంబర్లను కూడా వేసింది.

రెండో విడత నామినేటెడ్ పదవుల్లో భాగంగా మొదటి విడతలో చోటు దక్కని సామాజిక వర్గాలకు, సీనియ‌ర్ నేతలకు ఈసారి బెర్త్ పక్కా అనే టాక్ పార్టీలో బలంగా వినిపిస్తుంది. ఈసారి చాలా కీలకమైన కార్పొరేషన్ పదవులు భర్తీ కానున్నాయి. ఆర్టీసీ కార్పొరేషన్, సివిల్ సప్లై కార్పొరేషన్, మూసీ కార్పొరేషన్, హెచ్ఎండిఏ, రెడ్కో, మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైతు కమిషన్, విద్యా కమిషన్, స్టేట్ కౌన్సిల్ చైర్మన్, యాదవ, కూర్మ కార్పొరేషన్, చేనేత కార్పొరేషన్ పదవులను భర్తీ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇప్పటికే కొందరి పేర్లు ఫైనల్ కాగా నేత‌ల సిఫార‌సుల కార‌ణంగా కొన్ని మార్పులు చేస్తున్నారు.

తుది జాబితాలో కొన్ని సంస్థ‌ల‌కు ఛైర్మ‌న్‌ల‌ను ఖ‌రారు చేసిన‌ట్లు స‌మాచారం అందుతోంది. రైతు కమిషన్ చైర్మన్ గా సీనియర్ నేత కోదండరెడ్డి, విద్య కమిషన్ చైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి పేర్లు దాదాపుగా ఖరారైన‌ట్లు పార్టీ వ‌ర్గాల ద్వారా తెల‌సింది. ఈ రెండు కమిషన్‌లలో చెరో నలుగురు చొప్పున 8 మందిని మెంబర్లుగా చేరుస్తారు. ప్రస్తుత బీసీ కమిషన్ కాల పరిమితి ముగియనుంది. కొత్త కమిషన్ ఛైర్మన్ గా నిరంజన్ పేరు పరిశీలనలో ఉన్నట్లు స‌మాచారం.

రాష్ట్ర హెచ్ఆర్సీ, సమాచార హక్కు చట్టం సభ్యులను నియమించాల్సి ఉంది. వచ్చే వారం రోజుల్లో నామినేటెడ్ ప‌ద‌వుల భ‌ర్తీని పూర్తి చేసి అసంతృప్తుల‌ను చ‌ల్లార్చాల‌ని సీఎం నిర్ణ‌యించుకున్నారు. నామినేటెడ్ ప‌ద‌వులు ద‌క్క‌నివారికి టీపీసీసీలో కీల‌క ప‌ద‌వుల‌ను క‌ట్ట‌బెట్టేందుకు సీఎం నిర్ణ‌యించారు. ఈ మేర‌కు ఏఐసీసీ పెద్ద‌ల‌కు స‌మాచారం చేర‌వేయ‌గా గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని తెలిసింది. దీంతో సీఎం రాక కోసం పార్టీ నేత‌లు ఆశ‌గా ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news