హైదరాబాద్ జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ లకు భారీగా వరద పోటెత్తుతుంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో జంట జలాశయాలు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకున్నాయి. దీంతో జలమండలి అధికారులు అప్రమత్తం అయ్యారు. ప్రస్తుతం ఉస్మాన్ సాగర్ ఇన్ ఫ్లో 1800 క్యూసెక్కులు ఉండగా.. హిమాయత్ సాగర్ ఇన్ ఫ్లో 1400 క్యూసెక్కులుగా ఉంది.
ఉస్మాన్ సాగర్ పూర్తి స్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1787.95 అడుగులు ఉంది. హిమాయత్ సాగర్ గరిష్ట నీటి మట్టం 1763 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1755 అడుగులున్నట్టు అధికారులు వెల్లడించారు. ఉస్మాన్ సాగర్ కి సంబంధించిన 2 గేట్లను ఎత్తి మూసీ నది ద్వారా 226 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే హిమాయత్ సాగర్ సంబంధించిన ఒక గేట్ ను అడుగు మేర ఎత్తి 340 క్యూసెక్కుల నీటిని మూసీకి విడుదల చేస్తున్నారు. వరద నీరు విడుదల చేస్తుండటంతో మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో పాటు జీహెచ్ఎంసీ, పోలీసులు, జలమండలి అధికారులను అప్రమత్తం చేశారు.