తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆహార ప్రియులు ఎంతో ఇష్టంగా తినే మయోనైజ్ పై నిషేదం విధించాలని నిర్ణయించింది. ఫుడ్ సేప్టీ అధికారులతో ఇవాళ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజ నరసింహ సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మయోనైజ్ ని నిషేదిస్తున్నట్టు ఫుడ్ సేప్టీ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేయనున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో హోటల్స్, ఫుడ్ స్టాళ్లలో తరచూ తనిఖీలు నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు మంత్రి దామోదర రాజ నరసింహ.
రాష్ట్రంలో కొత్తగా 3 ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ లు, 5 మొబైల్ ఫుడ్ సేప్టీ ల్యాబ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు మంత్రి. కల్తీ ఆహారం తీసుకొని పలువురు తీవ్ర అనారోగ్యం పాలవుతున్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మయోనైజ్ కు ఎక్కువగా.. మండి బిర్యానీ, కబాబ్ లు, పిజ్జాలు, బర్గర్లు, శాండ్ విచ్ లు, ఇతరత్రా ఆహార పదార్థాల్లో చెట్నీలా వేసుకొని తింటారు. ఈ మధ్య కాలంలో జరుగుతున్న వరుస ఘటనలతో బల్దియా ఆహార కల్తీ నియంత్రణ విభాగం అప్రమత్తమైంది. ఎన్నిసార్లు చెప్పినా హోటళ్లు తీరు మార్చుకోవడం లేదంటూ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఆ పదార్థాన్ని నిషేదించేందుకు అనుమతి కోరింది.