అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు బిజెపి ఎంపీ ధర్మపురి అరవింద్. శనివారం జగిత్యాలలో అరవింద్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బిల్లుల విడుదలకు 7% కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ని ఎప్పుడు విడుదల చేసినా బిజెపి అధిక స్థానాలలో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తెలంగాణను అన్ని రకాలుగా కేసీఆర్ దిగజార్చారని మండిపడ్డారు అరవింద్. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. కేటీఆర్ పాదయాత్ర కాదు కదా.. పాకులాడిన ఓట్లు రావని ఎద్దేవా చేశారు. కెసిఆర్ చేసిన దరిద్రాన్ని కాంగ్రెస్ ఇంకా దరిద్రం చేస్తుందని ఆరోపించారు.
కాంగ్రెస్ వచ్చి ఏడాది అయినా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదని విమర్శించారు. పాదయాత్ర చేస్తే జనంతో కేటీఆర్ తన్నులు తింటారని ఎద్దేవా చేశారు. రాష్ట్రాన్ని మాజీ మంత్రి కేటీఆర్ దిగజార్చారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం బిజెపి మాత్రమేనని అరవింద్ పేర్కొన్నారు.