మహారాష్ట్ర వచ్చింది ఎన్నికల కోసం కాదు అని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని డెగ్లూరులో జరిగిన ఎన్నికల సభలో పవన్ కల్యాణ్ మరాఠీలో ప్రసంగించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. తొలుత జై భవానీ, జై శివాజీ, జై మహారాష్ట్ర అంటూ ప్రసంగాన్ని ప్రారంభించారు. తాను మరాఠీలో ప్రసంగిస్తానని.. ఏవైనా తప్పులు ఉంటే క్షమించాలని కోరారు. ఇది ఛత్రపతి శివాజీ పరిపాలించిన భూమి, ఇది ఆయన నడిచిన నేల, ఇంతటి వీరత్వం కలిగిన గడ్డ మహారాష్ట్ర.. మరాఠా ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అంటూ కొనసాగించారు.
తాను ఇక్కడికి ఓట్లు అడిగేందుకు రాలేదని, మరాఠా వీరులకు నివాళి అర్పించడానికి వచ్చానని పవన్ తెలిపారు. మరాఠా యోధుల పోరాటాన్ని గుర్తుచేసుకోవడానికి, శివాజీ మహరాజ్ పరిపాలనను, స్వాతంత్ర్య సమరయోధుల స్ఫూర్తిని గుర్తుచేసుకోవడానికి వచ్చానని వివరించారు. స్వరాజ్యం అర్థం తెలిపిన నేల, అంబేద్కర్ జన్మించిన నేలపై నివాళులు అర్పించేందుకు వచ్చానని పేర్కొన్నారు. గత పదేళ్లుగా ఎన్డీఏతో కలిసి ఉన్నాను. బాలాసాహెబ్ ఠాక్రే మరణించినప్పుడు నివాళులు అర్పించాను. శివసేన వ్యవస్థాపకుడు, హిందూ హృదయ సామ్రాట్ బాలా సాహెబ్ ఠాక్రే నుంచి ప్రాంతీయతను విస్మరించని జాతీయవాదాన్ని నేర్చుకున్నానని తెలిపారు.