మానవతా విలువల గురించి మాట్లాడే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని ఏపీ మాజీ సీఎం జగన్ విమర్శించారు. తల్లి, చెల్లి పేరుతో ఎందుకు రాజకీయం చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఆయన తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు రాజకీయాల కోసం ఏ గడ్డి అయినా తినడానికి వెనుకాడరు అని దుయ్యబట్టారు. తల్లిదండ్రులు బతికి ఉండగానే ఎప్పుడైనా వారిని ప్రజలకు చూపించారా..? రాజకీయంగా ఎదిగాకైనా పేరెంట్స్ ను నీ ఇంటికి పిలిచి రెండు పూటలా..? భోజనం పెట్టి సంతోషంగా పంపించావా..? అని ప్రశ్నించారు. కనీసం ఒక్కసారైనా కలిసి ఉన్నారా..? కాలం చేసిన తరువాత కనీసం తలకొరివి పెట్టావా అని నిలదీశారు జగన్.
మరోవైపు తనపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై, మా తల్లి, చెల్లిపై అసభ్య పోస్టులు పెట్టారు. వ్యక్తిత్వ హననం చేసేలా పోస్టులు ఎలా పెడతారని ప్రశ్నించారు. వర్రా రవీందర్ రెడ్డి పేరుతో ఫేక్ ఐడీ క్రియేట్ చేశారు. మా కుటుంబంలో విబేదాలు ఉన్నాయి. మీకు కుటుంబం ఉంది కదా..? అని ప్రశ్నించారు. మరోవైపు నా చెల్లి షర్మిల పై మీ బావమరిది బాలకృష్ణ తప్పుడు ప్రచారం చేయలేదా..? ఐటీడీపీ పేరుతో నా కుటుంబం పై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు జగన్.